అన్నదాత’ హరికృష్ణకు ఐసీఏఆర్‌ అవార్డ్

రైతు ఏడ్చిన రాజ్యం లేదు , ఎద్దు ఏడ్చిన ఎవుసం లేదు … ఈ మాటలను నరనరనా వంటబట్టించుకుని లేదు ..లేదు రక్తంలో కలుపుకుని రైతులుకు బీజాక్షరాల్లాంటి సూచనలతో, సలహాలతో, వ్యాసాలతో తెలుగులో అక్షర వ్యవసాయం చేస్తున్నదెవరూ అంటే కళ్లు మూసుకుని చెప్పచ్చు ఆయనే అమిర్నేని హరికృష్ణ. సాప్ట్ వేర్ ఉద్యోగి కు ఈయన గురించి పెద్దగా తెలియకపోవచ్చేమో కానీ …సామాన్య రైతుకు ఈయన బాగా సుపరిచితం. ఆయన అక్షరం…వాళ్లకు వేదవాక్కు. ఆయన ఆర్టికల్స్ చూస్తూంటే ఆశ్చర్యం వేస్తుంది. అంతెందుకు ..”ఎడారిలో ఒయాసిస్సు.. ఇజ్రాయెల్ వ్యవసాయం ” పుస్తకం చదివితే చాలు ఆయన అద్బుత అవగాహనకు ముచ్చటేస్తుంది.నిరంతరం రైతులు గురించి,పంటల గురించి,చెరువు గురించి ఈ తరంలో ఇంతలా ఎవరు ఆలోచిస్తారు..ఈ ‘రైతురత్న’ తప్ప అనిపిస్తుంది. అందుకేనేమో …భారత వ్యవసాయ పరిశోధనా మండలి ఐసీఏఆర్‌ అందించే ప్రతిష్ఠాత్మక జాతీయ అవార్డుకు ఈయన్ని ఎంపిక చేసారు. అన్నదాత పత్రిక కార్యనిర్వాహక సంపాదకుడు, ఈటీవీ చీఫ్‌ ప్రొడ్యూసర్‌ అమిర్నేని హరికృష్ణ ని ఈ అవార్డ్ కు ఎంపిక చేయటం..ఆ అవార్డ్ కే గౌరవం. దేశంలో వ్యవసాయ పరిశోధన, అభివృద్ధికి విశేషకృషి చేసిన పాత్రికేయులకు మాజీ ప్రధాని చౌదరి చరణ్‌ సింగ్‌ పేరిట ఐసీఏఆర్‌ ఏటా ఈ అవార్డును అందజేస్తుంది.
2019 ఏడాదికి గానూ ప్రింట్‌ మీడియా విభాగంలో హరికృష్ణను ఈ అవార్డుకు ఎంపిక చేశారు. వ్యవసాయ రంగంలో గత ఇరవై సంవత్సరాలకు పైగా ఆయన చేసిన విశిష్ఠ సేవలను గుర్తించి ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు ఐసీఏఆర్‌ ప్రకటించింది. ప్రాంతీయభాషల్లో పురస్కారాలు ఇవ్వడం ప్రారంభించిన తర్వాత ఈ అవార్డు అందుకున్న తొలి తెలుగు జర్నలిస్ట్ హరికృష్ణ కావడం గమనార్హం. ఆయనకు ప్రశంసా పత్రంతోపాటు, రూ.లక్ష నగదు బహుమతి ప్రకటించారు. ఐసీఏఆర్‌ 92వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా గురువారం దిల్లీలో జరిగిన సమావేశంలో దాదాపు 20 విభాగాల్లో అవార్డులను ప్రకటించారు. ఈ అవార్డ్ తో ..ప్రతీ రైతు హృదయం పులకిస్తుంది.అమిర్నేని హరికృష్ణగారికి మనస్పూర్తిగా శుభాకాంక్షలు తెలియచేస్తున్నాం